గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకోమాట.. రోజుకో అబద్ధం! అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడీని కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చెప్పిందంతా పూర్తిచేశాం’ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. రైతుభరోసా చెల్లించేశామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుంటే.. అసలు రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని, నిరుద్యోగ భృతి హామీ అసలు తామివ్వనేలేదని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తామని తామెక్కడా చెప్పలేదని రేవూరి ప్రకాశ్‌రెడ్డి వాదిస్తున్నారు. హామీల అమలుపై పూటకోసారి నాలుక మడతేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు రాహుల్‌గాంధీ కూడా చేరారు. ఆదివారం జరిగిన నిర్మల్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలనెలా రూ.2500 ఇప్పటికే అందిస్తున్నామని పచ్చి అబద్ధాన్ని ప్రజల సాక్షిగా ప్రకటించారు.