దేశ ప్రయోజనాలే ముఖ్యం : నెతన్యాహు


  • దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • విమర్శలను ఖండించిన ఇజ్రాయెల్
  • మమ్మల్ని ఏ ఒత్తిడి ఆపలేదు : నెతన్యాహు

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడి ఆపలేదన్నారు. ఒంటరిగానైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు నెతన్యాహు.

‘‘రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. మాకు అప్పుడు ఎలాంటి రక్షణ లేదు. ఏ దేశమూ మాకు అండగా నిలవలేదు. మా విధ్వంసం కోరుకుంటున్న ప్రత్యర్థులను ఈరోజు మళ్లీ ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో ఏ నాయకుడు, ఎలాంటి ఒత్తిడి, ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ణయమూ మమ్మల్ని మేం రక్షించుకోవడం నుంచి ఆపలేదు’’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొనసాగుతన్న నిరసనలనూ నెతన్యాహు తప్పుబట్టారు. వాటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వర్సిటీల్లో జరిగిన వివక్షాపూరిత ఘటనలతో పోల్చారు. అవి తాము కొనసాగిస్తున్న యుద్ధంపై నిరసనలు కావని.. తమ ఉనికిని సవాల్‌ చేయడమని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిడీ తమ చేతులను బంధించలేదన్నారు. విజయం సాధించే వరకు పోరాడతామని పునరుద్ఘాటించారు.
హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగిస్తోంది. ఈ పోరులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది పొట్టచేతపట్టుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. ఇజ్రాయెల్‌ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వీలైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌లోని ఓ విభాగంపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. కొన్ని సంస్థలు, వ్యక్తులపైనా చర్యలకు ఉపక్రమించింది. రఫాలోనూ భూతల దాడులకు పాల్పడితే తమ సహకారం ఉండబోదని హెచ్చరించింది. బ్రిటన్‌ సైతం హెచ్చరికలు చేసింది.

Spread the love