నల్గొండ గడ్డపై రైతు సమర గర్జన

కార్పొరేట్లకు భూములు… రైతులకు కన్నీళ్లు

నల్గొండ నుంచి AIKS సమరశంఖం 

మోడీ పాలనలో కార్పొరేట్‌ భూస్వామ్య విధానాలు

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు

AIKS బహిరంగ సభలో జాతీయ నేతల పిలుపు

NG కళాశాల మైదానంలో కదం తొక్కిన రైతులు

నల్గొండ, 2026 నవంబరు 15: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు దేశంలో కొత్త కార్పొరేట్‌ భూస్వామ్య వ్యవస్థకు దారితీస్తున్నాయని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) జాతీయ నాయకులు విమర్శించారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతుల భూములను బలవంతంగా సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజాసంఘాలతో కలిసి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ అయిన నల్గొండ నుంచే కార్పొరేట్‌ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నేతలు పిలుపునిచ్చారు.

ఎఐకెఎస్‌ 36వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరిగింది. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూకంటి రంగారెడ్డి సభకు అధ్యక్షత వహించారు.

మూడు నల్ల చట్టాలను మళ్లీ అమలు చేసే యత్నం :

సభలో ముఖ్యవక్తగా పాల్గొన్న మాజీ ఎంపీ బృందా కరత్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతుల ఆందోళనల ఫలితంగా ఉపసంహరించుకున్న మూడు వ్యవసాయ చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఎఐకెఎస్‌ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాల అమలుపై రైతాంగం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ, తెభాగా, వర్లీ వంటి రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించిన ఎఐకెఎస్‌.. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వాటి ప్రభావం భారత రైతులపై పడకుండా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడాలని, వారిని అడవుల నుంచి బలవంతంగా తరలించే చర్యలను అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు.

రోజుకు 114 మంది రైతుల ఆత్మహత్యలు:

ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ ధావలే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతుల సంక్షోభం మరింత తీవ్రమైందని అన్నారు. ఆయన పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో రోజుకు 114 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించకపోవడం, వ్యవసాయ రుణాల భారం రైతులను కుంగదీస్తున్నాయని పేర్కొన్నారు.రైతుల రుణమాఫీకి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం భారీ మొత్తంలో రుణాలను మాఫీ చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో సాగిన రైతాంగ పోరాటాల ద్వారా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. రైతులు, కార్మికులు, సామాజిక వర్గాల సమస్యలపై పోరాడటంతోపాటు రాజకీయ ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

 

రెండు నెలల్లో కరువు సమస్య పరిష్కరించాలి :

ఎఐకెఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమించాలని కోరారు. తెలంగాణలో కరువు సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రెండు నెలల్లోగా స్పందించాలని ప్రభుత్వాలకు గడువు ఇస్తున్నామని, లేనిపక్షంలో సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వరకు లక్ష మంది రైతులతో లాంగ్‌మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు.

AIKS Meeting

, AIKS సభలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ తదితరులు ప్రసంగించారు. ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. ఎఐకెఎస్‌ నాయకులు, ఎంపీ అమ్రారామ్‌, ఏఆర్‌ సింధు, పుణ్యవతి, జాన్‌ వెస్లీ, ఎం.సాయిబాబు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విప్లవ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.

Spread the love